శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Thursday, 6 April 2023

దార్శనికుడు (Scientist)

 దార్శనికుడు(Scientist)

అతడు వర్తమానం లో చరిస్తున్న భవిష్యత్ దార్శనికుడు

సృష్టి రహస్యాల్ని ఛేదిస్తూ సాగే అలుపెరుగని యాత్రికుడు

అతడి చేతులు

దిగ్ దిగంతాలు దాటుకుంటూ

అనంతాకాశపు ఆవలి అంచును సైతం అంది పుచ్చుకోగలవు

అతడి చూపులు

సాగర గర్భాల్ని చీల్చుకుంటూ

పరమాణు కేంద్రకాల్ని పటాపంచలు చేసుకుంటూ చొచ్చుకు పోగలవు

అతడి అడుగులు నాటికల్ మైళ్లంత విస్త్రతంగా ఉందనుకునేంత లోనే

నానో మీటర్లా సూక్ష్మీకరించుకుంటూ కాంతి సం వత్సరం లా దూసుకుపోతాయి

అతడి హృదయం వయలిన్ తంత్రులకు లయబద్ధంగా ఓ వైపు స్పందిస్తూనే

మరో వైపు వైరస్ ల వైచిత్రి ని విశ్లేషిస్తూ జీవ వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తుంది

అతడి మనసు నీతో నాతో సంచరిస్తూనే

సరికొత్త సంబంధాలను సృజించడం లో సంగమిస్తుంది

అనాది నుండి అతనొక నిరంతర శ్రామికుడు

నిత్య చైతన్య స్ఫూర్తి

మానవాళి సౌఖ్యం కోసం పరిశోధనే ప్రాణంగా

ప్రజ్వలిస్తున్న విజ్ఞాన వీచిక

అతడే ఓ కెప్లర్... ఓ జన్నర్...ఓ రామన్... ఎందరెందరో

 (ఆంధ్రప్రదేశ్ 9 వ తరగతి భౌతిక శాస్త్రము వెనుక అట్ట లోపలిభాగం లోని కవిత. రచయిత పేరు లేదు. వారికి ధన్యవాదాలు )